'ముగ్గురు 'ఆడియో ఆవిష్కరణ



సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి. రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం 'ముగ్గురు'. నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్ కథానాయకులు. రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య నాయికలు. నాగేంద్ర వి. ఆదిత్య దర్శకుడు. శివాజీ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సీడీని డా.డి.రామానాయుడు ఆవిష్కరించి డి.సురేష్‌బాబుకు అందజేశారు. రామానాయుడు మాట్లాడుతూ "ఈ సినిమాను త్వరగా పూర్తి చేశాం. మలేషియా, కారంచేడు, వైజాగ్‌ల్లో షూటింగ్ చేశాం. ఎక్కడా టెన్షన్ పడలేదు. మొత్తం ఆరు పాటలున్నాయి. చంద్రబోస్ ఐదు పాటలు, రామజోగయ్యశాస్త్రి ఓ పాటను రాశారు.

చిన్న పాత్రకోసం పిలిచినా... అందరూ పిలవగానే వచ్చి నటించారు. ఈ సినిమా వైవిధ్యంగా ఉంటుంది'' అని అన్నారు. చంద్రబోస్ మాట్లాడుతూ "17 ఏళ్ళ క్రితం 'తాజ్‌మహల్' ద్వారా గీతరచయితగా పరిచయమయ్యాను. ఈ బ్యానర్‌లో రాస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. టైటిల్ సాంగ్‌లో చేసిన ప్రయోగం అందరి మెప్పు పొందుతుందన్న నమ్మకం ఉంది'' అని చెప్పారు. "నా కెరీర్‌లో ఇంత త్వరగా షూటింగ్ అయిన సినిమా ఇదే కావడం విశేషం'' అని నవదీప్ అన్నారు. "వి.ఎన్.ఆదిత్యతో కలిసి ఇంతకుముందే పనిచేశాను.

నాయుడుగారి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది'' అని రాహుల్ చెప్పారు. "అందరినీ మెప్పించే సినిమా అవుతుంది. దర్శకుడు కసితో తెరకెక్కించారు. ఆద్యంతం నవ్వులు పంచుతుంది. ఈ సినిమాలో నాకు మంచి పాటలున్నాయి'' అని అవసరాల శ్రీనివాస్ తెలిపారు. "షూటింగ్ పూర్తయినట్టే అనిపించలేదు. ఈ బ్యానర్‌లో నటించడం అదృష్టం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య అన్నారు. రీమాసేన్ మాట్లాడుతూ "మనసంతా నువ్వే చిత్రాన్ని నేను మర్చిపోలేను.

చాన్నాళ్ళ తర్వాత నేను తెలుగులో నటిస్తున్న చిత్రం ఆదిత్యదే కావడం విశేషం'' అని చెప్పారు. వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ "నాయుడుగారి నేతృత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ సంస్థలో సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. కోటిగారు ఒకే సిట్టింగ్‌లో మంచి ఆల్బమ్ ఇచ్చారు. సంగీతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు ఆద్యంతం నవ్వుతూ సినిమాను ఆస్వాదిస్తారన్న నమ్మకం ఉంది'' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జవహర్‌రెడ్డి, అభిరామ్, సత్యానంద్, నివాస్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఆడియో ఆదిత్య ద్వారా విడుదలైంది.




Share your views...

0 Respones to "'ముగ్గురు 'ఆడియో ఆవిష్కరణ"

Post a Comment

 

© 2010 Cinemamasti.com All Rights Reserved